సారంగాపూర్ మండలం యాకరపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు కామటి చరణ్ మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యాకరపల్లి గ్రామానికి చెందిన సత్యపాల్ రెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను బాలుడు చరణ్ నడుపుతున్నాడు. యాకరపల్లి నుండి బోరెగాం వెళ్లే దారిలో, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల పొలాల్లోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో, ట్రాక్టర్ పైనుంచి తప్పించుకునేందుకు బాలుడు చరణ్ తో పాటు ట్రాక్టర్‌పై ఉన్న గంగన్న అనే వ్యక్తి దూకారు. దురదృష్టవశాత్తు, చరణ్ పైనుంచి ట్రాక్టర్ వెళ్లిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












