జైపూర్ మండలం వెలాల గ్రామంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం జరిగింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్‌పామ్ సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వెలాల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త స్రవంతి, హార్టికల్చర్ అధికారి రఘునందన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సమతుల్య ఎరువుల యాజమాన్యం, నానో యూరియా వినియోగం, మట్టి పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించారు. పంటలకు అవసరమైన మోతాదులో ఎరువులు వాడడం ద్వారా దిగుబడి పెంచవచ్చని, ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. రసాయనాల వాడకాన్ని తగ్గించి, జీవన ఎరువులు, కషాయాలతో సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు.
తక్కువ నీటితో అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్ సాగు ప్రయోజనాలను, ప్రభుత్వ సబ్సిడీలను వివరించారు. భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. అనంతరం రైతులతో కలిసి గ్రామంలోని ఆయిల్‌పామ్ తోటను సందర్శించి, ప్రత్యక్షంగా సాగు మెళకువలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతులు తమ సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకున్నారు.











