మంచిర్యాలలో ఈ నెల 25న ముదిరాజుల సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు ముదిరాజు నాయకులు తెలిపారు. వేంపల్లి పద్మావతి గార్డెన్లో జరిగే ఈ సభ, బీసీ డీ నుండి ఏలోకి మార్పుతో సాధికారత దిశగా సాగుతుందని పేర్కొన్నారు.
మంచిర్యాలలో ఈ నెల 25న ముదిరాజుల సింహగర్జన సభ నిర్వహించనున్నట్లు ముదిరాజు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శులు దబ్బెట తిరుపతి, తండ బోయిన శ్రీకాంత్, కంకణాల సతీష్, పిట్టల తిరుపతి, రాష్ట్ర యువత నాయకులు గరికే సుమన్, పట్టణ అధ్యక్షులు భూతపల్లి రాజేశం లు తెలిపారు. పిలిస్తే కాదు, తెలిస్తే కదిలి రావాలని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని, ఇది ఏ సంఘానికీ సంబంధించినది కాదని వారు స్పష్టం చేశారు. ముదిరాజుల అభ్యున్నతి, సాధికారత దిశగా ఈ సభ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మత్స్య శాఖలో హక్కుల సాధనతో పాటు, రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాల 14 శాతం ఓట్ల చైతన్య రాజకీయ అవగాహనపై ఈ సింహగర్జన జరుగుతుందని తెలిపారు. పలువురు వక్తలు ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజు సైనికుడిపై ఉందని వారు కోరుతున్నారు.
ముఖ్యంగా పండ్ల తోటల నిర్వహణ, కౌలు రైతుల ఇబ్బందులు, జాతి ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి కల్పన రంగాల అంశాలపై నేతల ప్రసంగం సాగనుంది. మంచిర్యాల జిల్లాలోని వేంపల్లి పద్మావతి గార్డెన్లో ఆదివారం జరిగే ఈ కార్యక్రమాన్ని ముదిరాజులు విజయవంతం చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో 10వేల, చెన్నూరులో 30వేల, బెల్లంపల్లిలో 9వేల కుటుంబాలకు సింహగర్జన ఆహ్వానం పలుకుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా, జాతి హక్కుల సాధన దిశగా ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ లతో పాటు ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం పలికినట్లు నేతలు చెప్పారు.












