రంగురంగుల పూలతో, బతుకమ్మ పాటలు, మహిళల ఆటపాటల కోలాహలం నడుమ సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూలతో పేర్చిన బతుకమ్మలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుద్దీపాల అలంకరణలతో చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది. ఎనిమిది టన్నుల పూలతో రూపొందించిన 32 అడుగుల మహా బతుకమ్మ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 16 టన్నుల ఉక్కుతో నిర్మాణాన్ని సిద్ధం చేసి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక ట్రస్ లైటింగ్‌తో వేదికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారీ తెరలు, ఫ్లడ్‌లైట్ టవర్లు, విద్యుద్దీపాల వెలుగులతో చెరువు కట్ట పరిసరాలు కాంతులీనాయి. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గత పది రోజులుగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సాయంత్రం ఐదు గంటల నుంచే చెరువు కట్ట వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి, వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి నిర్మల జగ్గారెడ్డి, జయారెడ్డి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాన్ని పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ వేడుకల్లో పూల బతుకమ్మలు, మహిళల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత సంతోష్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.












