సంగారెడ్డి, 2026-08-24
వచ్చే నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు తమవంతు సహకారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ఈ మేరకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జి. భవానీ చంద్ర మాట్లాడుతూ.. న్యాయవాదులు తమ వద్ద ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి, కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని కోరారు. సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లు, కుటుంబ వివాదాలు, కార్మిక వివాదాలు తదితర రాజీకి అనుకూలమైన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వరంగా, సులభంగా, సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని తెలిపారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించబడిన కేసులకు సంబంధించి చెల్లించిన కోర్టు ఫీజును నిబంధనల ప్రకారం తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను అధిక సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేసి, కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు సహకరించాలని కోరారు. కోర్టులు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే జాతీయ లోక్ అదాలత్‌ను మరింత విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సంజీవ రెడ్డి, కార్యదర్శి, ప్రతినిధులు, న్యాయవాదులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య, జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.