మండలంలో కోతుల బెడద తీవ్రతరమైంది. జనావాసాల్లోకి వస్తున్న కోతుల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, కోతులను అటవీ ప్రాంతాలకు తరలించాలని పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు అధికారులను కోరారు.
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల సంచారం పెరిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోతుల బెడదను వెంటనే నివారించి, వాటిని జనావాసాల నుంచి అటవీ ప్రాంతాలకు తరలించాలని పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు అధికారులను కోరారు.
గ్రామాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. ఇది పిల్లల భద్రతకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
కోతులు మనుషులపై దాడులకు పాల్పడటమే కాకుండా, ఇళ్ల సమీపంలోని పండ్ల చెట్లను, పెరట్లో పెంచుతున్న కూరగాయల మొక్కలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. తలుపులు తెరిచి ఉంటే ఇళ్లలోకి చొరబడి, సామగ్రిని చెల్లాచెదురు చేయడంతో పాటు కొన్ని వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో కోతుల దాడుల్లో గాయపడిన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఘటనలున్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కోతుల బెడదను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను అనుసరించి, జనావాసాల్లోకి వస్తున్న కోతులను సంబంధిత అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో సురక్షితంగా పట్టుకుని, అటవీ ప్రాంతాలకు తరలించాలని పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు గోళ్ళ రాజమల్లు, మండల అధ్యక్షులు తాళ్ల కుమారస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నవేని భాను, ప్రధాన కార్యదర్శి గరిగె మురళి తదితరులు అధికారులకు వినతి చేశారు.


