⚠️ (అక్షరవేకువ) జూలై 22
కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెన్నూరు రూరల్ సర్కిల్ పోలీసులు అత్యవసర విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత నది, వాగులు, వంకలు, చెరువులు, వరదనీటి ప్రవాహాల వద్దకు వెళ్లరాదని, విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెన్నూరు రూరల్ సర్కిల్ పోలీసులు అత్యవసర విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత నది, వాగులు, వంకలు, చెరువులు, వరదనీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని, సెల్ఫీలు దిగడం, స్నానం చేయడం, చేపల వేట, వరదనీటిని దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.
పాత మట్టి ఇండ్లలో నివసిస్తున్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు కోరారు. గోడల్లో పగుళ్లు, పైకప్పు నుంచి నీరు కారడం, గోడలు వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఇల్లు ఖాళీ చేయాలని సూచనలు జారీ చేశారు.
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దని హెచ్చరించారు. చిన్నపిల్లలను నీటి ప్రవాహాలు, చెరువులు, నది ఒడ్డుకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
వరద ముప్పు, ఇల్లు కూలే ప్రమాదం, తెగిన విద్యుత్ తీగలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. "వర్షాకాలంలో నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుంది. ప్రజల ప్రాణ భద్రతే మా మొదటి ప్రాధాన్యం. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలి" అని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. కృష్ణ తెలిపారు.











