మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 26
మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయాన్ని రూ.10 కోట్లతో పునర్నిర్మించనున్నారు, దీనికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది.
మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయానికి మహర్దశ పట్టనుంది. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నూతన ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సురేఖమ్మకు అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు.
మూడు ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ
ఈ పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ వాసవీమాత ఆలయాలను నిర్మించనున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుర ప్రముఖుల కోరిక మేరకు దేవాదాయ శాఖ ఆగమ శాస్త్ర నియమాలు, స్థపతుల సూచనల ప్రకారం ఉత్తర ముఖ ద్వారంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి రావాలి
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తికావాలని, రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఆలయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాలని, ప్రజలందరిపై పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముక్త రవి, ఆలయ అర్చకులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ పాల్గొన్నారు.






