పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా సిట్టాంగ్ ప్రాంతంలో హనీమూన్‌కు వెళ్లిన ఓ నవ దంపతులకు ఊహించని విషాదం ఎదురైంది. ఓ హోమ్‌స్టేలో బార్బిక్యూ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నవ వధువు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించి హోమ్‌స్టే యజమానులు, మేనేజర్, సిబ్బందితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన సౌవిక్ దాస్, నికితా దాస్‌లకు పెళ్లయి సుమారు రెండు నెలలు కావడంతో హనీమూన్ కోసం కు వెళ్లారు. సిట్టాంగ్లోని హోమ్‌స్టేలో బస చేసిన వారు రాత్రి సమయంలో బార్బిక్యూ ఏర్పాటు చేసుకున్నారు.
ఒక్కసారిగా ఎగిసిన మంటలు
సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. దంపతులు బార్బిక్యూ వద్ద కూర్చుని ఉండగా, ఓ సిబ్బంది మంటను పెంచేందుకు ద్రవ పదార్థాన్ని గ్రిల్‌పై పోశాడు. వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి నికితా వైపు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆమె శరీరం మంటల్లో చిక్కుకుంది. భర్త సౌవిక్ వెంటనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన చేతికి కూడా గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు తన దుస్తులను ఉపయోగించినట్లు వీడియోలో కనిపించింది.
60 శాతం కాలిన గాయాలు
ఈ ప్రమాదంలో నికితాకు శరీరంలో సుమారు 60 శాతం కాలిన గాయాలు అయినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆమెను తొలుత సమీప ఆసుపత్రికి తరలించి, అనంతరం సిలిగురిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భార్యను రక్షించే క్రమంలో గాయపడిన సౌవిక్ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
హోమ్‌స్టే యాజమాన్యంపై ఆరోపణలు
ప్రమాదం జరిగిన వెంటనే సరైన వైద్య సహాయం, రవాణా సదుపాయం అందలేదని నికితా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం జరిగిందని కుటుంబం పేర్కొంది. అయితే, హోమ్‌స్టే మేనేజర్ ఈ ఆరోపణలను ఖండించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమ్‌స్టే యజమానులు పవన్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు నేహల్ ఐరన్, మేనేజర్ దీపెన్ లామా, సిబ్బంది నసీరుద్దీన్‌ను అరెస్ట్ చేసినట్లు టెలిగ్రాఫ్ ఇండియా నివేదించింది. బార్బిక్యూలో ఉపయోగించిన ద్రవ పదార్థం ఏమిటి, భద్రతా చర్యలు పాటించారా, ప్రమాదం తర్వాత బాధితురాలికి సకాలంలో వైద్య సహాయం అందిందా వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హనీమూన్ సందర్భంగా జరిగిన ఈ ప్రమాదం పర్యాటక వసతి కేంద్రాల్లో అగ్ని భద్రతా చర్యలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.


