తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందేమాతరం ఆలపించారు. అదేవిధంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల బోలో గణేష్ మండలి వద్ద, బిజెపి సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందేమాతరం ఆలపించారు. స్వాతంత్ర్య పోరాట ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బాలగంగాధర్ తిలక్ ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం లభించిన రోజును జాతీయ జెండాల ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించుకోవడం మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా, నాటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ ఇంట్లో జరుపుకునే గణేష్ పండుగను ప్రజలలో కుల, మతాలకు అతీతంగా జాతీయ భావాన్ని, ఐక్యతను పెంపొందించడానికి, ప్రజలందరినీ జాతీయ ఉద్యమం వైపు మళ్లించడానికి ముఖ్య భూమిక పోషించిందని తెలిపారు. అందువల్ల, హిందువులందరూ జాతీయ భావంతో, బాలగంగాధర్ స్ఫూర్తిగా వారి చిత్రపటాన్ని అన్ని గణేష్ మండళ్లలో ఏర్పాటు చేసుకోవాలని హిందూ సమాజం పిలుపునిచ్చిందని, ఆ సందర్భంగా విజయనగర్ బాల గణేష్ మండలిలో వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మూడుసార్లు దేశ ప్రధానిగా, అత్యధిక కాలం పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో మరిన్ని రోజులు దేశాన్ని పరిపాలించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, ఈరోజు ప్రతి ఇంటిలో జ్యోతి వెలిగించి ఆయన కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మున్నారాజ సిసోడియా, తులా మధుసూదన్ రావు, సుధాకర్, గందె శ్రీనివాస్, వొట్నాల సత్యనారాయణ, రమేష్, రమ, రమేష్ రెడ్డితో పాటు నలంద పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆ ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.












