సదాశివపేట పట్టణం చాపలకేరిలోని శ్రీ మహంకాళి మందిరం వినాయక మండపం వద్ద ఎంపల్లి నిఖిల రాజేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, కౌన్సిలర్లు పులిమామిడి మమత, వైద్యం గోపి ప్రియాంక పవన్ కుమార్, గారెల గౌరీదేవి, తుల్జారామ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముఖ్య అతిథులు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ వారు వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత మాట్లాడుతూ, పట్టణంలో 25వ తేదీన జరిగే వినాయక నిమజ్జనంపై పలు సూచనలు చేశారు. పట్టణంలో ఉన్న వినాయకులన్నిటికీ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా లాటరీ పద్ధతిలో నంబర్లు తీశారని, ఆ నంబర్ల ప్రకారంగానే తమ తమ వినాయకులను తొందరగా నిమజ్జనానికి తరలించాలని యువతకు సూచించారు. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ మహంకాళి యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, యువజన సంఘాల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా అనేక మందికి భోజన వసతి కల్పించారు.











