మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వర్గం నుంచి మంత్రి వివేక్, ఎంపీ వంశీ వర్గంలోకి మాజీ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేరడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ పరిణామం ఎమ్మెల్యే వర్గానికి ప్రతిబంధకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
గతంలో మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రి, ఎంపీల పర్యటనలు కొనసాగేవి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్, ఎంపీ వంశీ అనుచరులు సైతం రామకృష్ణాపూర్, మందమరి కాంగ్రెస్ నాయకులే అధిక సంఖ్యలో ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మొన్నటివరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా మంచిర్యాల రాజకీయాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉండేవి.
జగన్, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు
ఎమ్మెల్యేకు తన ప్రధాన అనుచరుడు మంతెన జగన్కు విభేదాలు రావడంతో జగన్ మంత్రి వివేక్, ఎంపీ వంశీ వర్గంలో చేరారు. మంతెన జగన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సుర్మిండ్ల వేణు సైతం జతకట్టారు. దీనికి తోడు 8 మంది కార్పొరేటర్లు, 3 కౌన్సిలర్లు చేరడం, లక్సెట్టిపేట మాజీ సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు చేరడంతో మంచిర్యాలలో మంత్రి, ఎంపీల ముద్ర బలంగా వేసేందుకు జగన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
రాజకీయ సమీకరణాలు మారే అవకాశం
ఇటీవల మంత్రి వివేక్, జగన్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, శుక్రవారం ఎంపీ మంచిర్యాల్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ వంశీ కూడా జగన్ నివాసంలో మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మంచిర్యాల కాంగ్రెస్ లో జగన్ చేరికతో ఫ్లెక్సీల హంగామా కొనసాగుతోంది.
ఎమ్మెల్యే వర్గానికి సవాల్
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో మంత్రి, ఎంపీ ఫ్లెక్సీలు పెట్టాలంటే గతంలో జంకేవారు. ఇప్పుడు జగన్ వర్గ తీరుతో ఎమ్మెల్యే వర్గానికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.












