బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు తమవంతు సహకారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి కోరారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, చట్టాన్ని ఉల్లంఘించే మత పెద్దలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో బాల్య వివాహంతో బతుకు ఆగం బాల్య వివాహ నిషేధ చట్టం-2006 అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టడంలో మత పెద్దల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు నిర్వహిస్తే, సంబంధిత మత పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లలిత కుమారి తెలిపారు. వివాహాలు నిర్వహించే సమయంలో వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆమె సూచించారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని మత పెద్దలకు సూచించారు. అన్ని మతాల మత పెద్దల సహకారంతో సంగారెడ్డి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ రాజారెడ్డి, డీసీఆర్బీ సీఐ రమేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీవో) రత్నం, స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఉప్పలయ్య, బాలల సంక్షేమ సమితి సభ్యులు వెంకటేశం, విష్ణుమూర్తి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, డీసీపీయూ సిబ్బంది లింగంతో పాటు జిల్లాలోని సుమారు 100 మంది మత పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.












