జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రజారోగ్య పరిశీలన బృందం (స్పాట్) జిల్లాలో పర్యటించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన తొమ్మిది కీలక కార్యక్రమాల అమలు తీరును బృందం పరిశీలించి, అధికారులతో చర్చించింది.
ఎన్సీడీసీ కన్సల్టెంట్ డా. శ్యామ్ నేతృత్వంలో డా. రాజనీ, డా. మనోహర్‌రెడ్డి, డా. జ్యోతితో కూడిన బృందం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డా. కె. లలితా దేవితో సమావేశమైంది. కార్యక్రమాల అమలు, వ్యాధుల నియంత్రణ, నిఘా వ్యవస్థలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. బృందం జాతీయ రేబిస్ నియంత్రణ, పాముకాటు నిర్వహణ, సమగ్ర ఆరోగ్య విధానం, సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత, వాతావరణ మార్పులుమానవ ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, లెప్టోస్పిరోసిస్ నియంత్రణ, వైరల్ వ్యాధులు, సమగ్ర వ్యాధి నిఘా వంటి కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కార్యక్రమాల పర్యవేక్షణ, వ్యాధుల నిఘా, నివేదికల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను కూడా సమీక్షించింది.
జిల్లాలో ప్రజారోగ్య కార్యక్రమాల అమలు తీరుపై డా. శ్యామ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. వ్యాధుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్సీడీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజారోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని డీఎంహెచ్‌వో డా. లలితా దేవి తెలిపారు. బృందం సూచనలను పాటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.












