తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేడి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో జరిగిన సమితి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే ఇంటికో ఉద్యోగం, ఉచిత బస్సు సౌకర్యం, హెల్త్ కార్డు, కుటుంబానికి రూ.20 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు
అంతేకాకుండా, రూ.10 వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సమితి నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో ఏ విధంగా పోరాడామో, అదే విధంగా ఉద్యమకారుల హక్కుల సాధన కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామిడి కుమార్, రాష్ట్ర కార్యదర్శి గోమతి రాజయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కత్తెర వల్ల రమేష్, కోల శ్రీనివాస్, ఠాకూర్ సుశీల్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు గొల్ల రాజమల్లు, జేఏసీ అధ్యక్షుడు పేరామాండ్ల శంకర్ గౌడ్, గాడికొప్పుల సురేందర్, గుండ రవీందర్, శీర్ల వెంకటేశ్వర్లు, కుదురుపాక గంగయ్య, పిట్టల రాజన్న, మర్రిపల్లి వెంకటేష్, తోట శంకర్, బొమ్మెన సత్యం, సందెల తిరుపతి, చుంచు శంకర్, కాశెట్టి శంకర్, ఇస్లావత్ శంకర్, మాడవి హన్మంత్, కొంరం భీమారావుతో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.











