జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య బుధవారం కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జైలులోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, న్యాయ సహాయం, వారి సమస్యలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జైలులోని వివిధ విభాగాలను సందర్శించి ఖైదీలతో నేరుగా మాట్లాడారు.
ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, తమకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు.
ఖైదీలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపారు. ఖైదీలలో చట్టంపై అవగాహన పెంపొందించడంతో పాటు, విడుదల అనంతరం సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించేందుకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


