సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న ఏడు నెలలు తాగునీటి విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాలం చెప్పినట్లు, కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈసారి సరైన వర్షాలు లేవు. మనం సింగూరు డ్యామ్‌పై ఆధారపడి ఉన్నాం. సింగూరుకు వచ్చే నీరు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరినో నిందిస్తే సమస్య పరిష్కారం కాదు. నీళ్లు ఉంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నీటి లభ్యతను బట్టే వినియోగం ఉండాలి అని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం సుమారు 3 టీఎంసీల నీరు మాత్రమే ఉందని వివరించారు. ప్రస్తుతం ఉన్న నీటితో డిసెంబర్ వరకు తాగునీటి సరఫరా కొనసాగించగలమని భావిస్తున్నట్లు తెలిపారు. దసరా తర్వాత రోజు విడిచి రోజు తాగునీరు విడుదల చేయనున్నట్లు మిషన్ భగీరథ ఎస్ఈ వెల్లడించారు. నీటి కొరతపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు నాలుగు మండలాల గ్రామాల్లో నీటి లభ్యత, పొదుపుపై చాటింపు వేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో పాంప్లెట్లు, మైక్‌ల ద్వారా ఇంటింటా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఇళ్లలో నల్లా నీటిని వృథా చేయకుండా, అవసరం లేని సమయంలో ట్యాప్‌లను తప్పనిసరిగా మూసివేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగిల్ ఫేజ్ మోటార్ల వద్ద పెద్దఎత్తున నీరు వృథా అవుతున్నందున దానిని నియంత్రించాలని సూచించారు. టైమర్ స్టార్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చని సమావేశంలో సూచనలు వచ్చాయి. సింగిల్ ఫేజ్ మోటార్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా అధికారులు ప్రతిపాదించారు. వచ్చే ఏడు నెలలు పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ బాధ్యతగా వ్యవహరించి అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని జగ్గారెడ్డి కోరారు. మంజీరా, సింగూరు పరిధిలో మోటార్లతో యథేచ్ఛగా నీటిని తోడటాన్ని నియంత్రించాలని సమావేశంలో పలువురు సూచించారు.
మంజీరా బ్యారేజీ నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నీటి డ్రాయింగ్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించేలా విజ్ఞప్తి చేస్తే, సంగారెడ్డి మున్సిపాలిటీకి మరికొంత కాలం తాగునీటి సరఫరా కొనసాగించే అవకాశం ఉంటుందని సమావేశంలో చర్చించారు. అవసరమైతే మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిసర చెరువుల్లో నీరు అందుబాటులో ఉందని, గ్రామంలోని 28 బోర్లకు అవసరమైన మోటార్లు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. మిషన్ భగీరథ సరఫరాలో ప్రెషర్ పెంచితే ఇస్మాయిల్ ఖాన్ పేట, హనుమాన్‌నగర్, ఫసల్వాడి గ్రామాలకు నీటి సరఫరా మెరుగు పడుతుందని సమావేశంలో ప్రస్తావించారు. మండలం తోపుగొండలో మిషన్ భగీరథ నీరు నెలకు నాలుగుసార్లు మాత్రమే వస్తోందని నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో పశువులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సర్పంచ్‌లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఇటీవల నీటిని విడుదల చేసిన అంశంపైనా జగ్గారెడ్డి స్పందించారు. ఢిల్లీ నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు సింగూరు ప్రాజెక్టును పరిశీలించగా, కట్టలో కొంత భాగం దెబ్బతిన్నట్లు గుర్తించి మరమ్మతుల కోసం కొంత నీటిని విడుదల చేయాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షణలో నిపుణుల కమిటీ సూచనల మేరకే నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో డ్యామ్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నీటిని విడుదల చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే కానీ, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయం చేయడంలో అర్థం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.












