కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. ఈ నిరసనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి జగ్గారెడ్డి దంపతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న రోజుల్లోనూ సంఘీభావ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










