ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని, ఆ భూములను సాగుచేసుకుంటూ పేదలు జీవనం సాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు అందించి, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరాగాంధీది చారిత్రక పాత్ర అని కొనియాడారు. భూమిని పేద కుటుంబాల బతుకుదెరువుకు ఆధారంగా మార్చిన ఆమె కృషి మరువలేనిదన్నారు. బ్యాంకుల జాతీయీకరణతో సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని గుర్తుచేశారు. మెదక్ ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీకి సంగారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉందని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఆమె పాల్గొన్న రెండు సభలను ఆయన గుర్తు చేశారు. ప్రధాని జిల్లా పరిషత్ సమావేశంలోనూ పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఓడీఎఫ్ ()తోపాటు బీడీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమె చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. దేశ భద్రత కోసం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ 1984లో తూటాలకు బలయ్యారని ఆయన అన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పాలన దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పునాదులు వేసిందని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ, తన నానమ్మ ఇందిరాగాంధీ ఆశయాల బాటలో ప్రజల కోసం పని చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.






