తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ధనిక తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం నాయకత్వం అభినందనీయమని కొనియాడారు.
సంగారెడ్డి జిల్లా కొడంగల్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి, హ్యాపీ బర్త్ డే రేవంత్ అన్న అంటూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధును సీఎం ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ, గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని, అయినప్పటికీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాలు, ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని నీలం మధు కొనియాడారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నీలం మధు పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందుకు దూరదృష్టి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరమని, అలాంటి బాధ్యతను భుజాన వేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని నీలం మధు మరోసారి గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడించి తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నీలం మధు పిలుపునిచ్చారు. భగవంతుడి దయతో రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.







