మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 14
జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అనుబంధ సంస్థ నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఆకుల రాజు ఘన విజయం సాధించారు. కార్యదర్శిగా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. రాత్రి 11 గంటలకు వెలువడిన ఫలితాలతో ఉత్కంఠ నెలకొంది.
(అక్షరవేకువ): జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అనుబంధ సంస్థ నిర్వహించిన ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ మధ్య రసవత్తరంగా సాగాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆకుల రాజు ఘనవిజయం సాధించగా, కార్యదర్శిగా అలుగువెల్లి రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు రాత్రి 11 గంటలకు వెలువడటంతో జర్నలిస్టుల్లో ఉత్కంఠ నెలకొంది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు మద్దతుదారులు బాణసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సాధనతో పాటు జర్నలిస్టు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రతి జర్నలిస్టుకు అండగా నిలుస్తూ హక్కుల సాధన దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.







