సంగారెడ్డి, 15 November
యువత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకొని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం జేఎన్టీయూ సుల్తాన్పూర్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు.
యువత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకొని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం జేఎన్టీయూ సుల్తాన్పూర్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా పనిచేయగల నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్కేఎస్ఎస్ ఏజెన్సీ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ జాబ్ మేళాలో సుమారు వెయ్యి మంది నిరుద్యోగ యువతీ యువకులు పేర్లు నమోదు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఎస్కేఎస్ఎస్ సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు.


