రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ మంత్రి వాకిటి శ్రీహరిపై ప్రదర్శించిన అహంకారపూరిత వైఖరిని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి కొనసాగుతోందని ఆరోపించింది.
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు అవమానాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ వ్యవస్థలో ఆధిపత్య కులాల ప్రాబల్యమే కొనసాగుతోందని ఆరోపించారు.
దేశంలో, రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకు సరైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు స్పందించాలని డిమాండ్ చేశారు.
బీసీలను అణగదొక్కే ధోరణులను సహించబోమని హెచ్చరించిన నరెడ్ల శ్రీనివాస్, బీసీ సంఘాలను ఏకం చేసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతామని తెలిపారు.











