మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 29
హాజీపూర్ మండలం దుబ్బ పల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఐదేళ్ల క్రితం నాటిన టేకు చెట్లను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే నరికివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం బహిరంగంగా చెట్లను నరుకుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు.
హాజీపూర్ మండలం పరిధిలోని దుబ్బ పల్లిలో గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఐదేళ్ల క్రితం ఈజీఎస్ కింద నాటిన 25 టేకు మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. ప్రస్తుతం వాటిలో 13 చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే టేకు చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికివేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజాగా శుక్రవారం ఉదయం, గుర్తు తెలియని వ్యక్తి బహిరంగంగా టేకు చెట్లను నరకడం చూసిన స్థానికులు నగరపాలక సంస్థ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. అయితే, చెట్లు నరుకుతున్న వ్యక్తికి కొందరు అండదండలు ఉండటంతో, అడ్డుకున్న సిబ్బందిపై ఎదురుతిరిగాడు.
ఆలయ కమిటీ సభ్యులు జోక్యం చేసుకుని మందలించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ, అటవీ శాఖ అధికారులు స్పందించి, చెట్లు నరికివేతకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












