జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల, నర్సింగాపూర్ మరియు గంగిపల్లి గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను ఎంపీడీవో జి. సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపు రావు మంగళవారం పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్లు సేకరిస్తున్న వివరాలను వారు తనిఖీ చేశారు.
ఎంపీడీవో జి. సత్యనారాయణ మాట్లాడుతూ, జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి, కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుందని ఆయన వివరించారు.
ప్రభుత్వ పథకాల రూపకల్పన, భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ గణాంకాలు అత్యంత కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఎంపీడీవో, లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్లో లేకుండా చూడాలని హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.












