బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ ఆవుల రవాణాను అరికట్టేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు మంచిర్యాల జిల్లా తాండూర్ రేపల్లెవాడ శివారులో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) ఏ. భాస్కర్ మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.
డిసిపి ఏ. భాస్కర్ మాట్లాడుతూ, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకే తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి శాఖాపరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలను పరిశీలించాలని, ప్రతి వాహన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినా, అనుమానాస్పద రవాణా కనిపించినా స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ తనిఖీలలో తాండూర్ సిఐ దేవయ్య, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తాండూర్ ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








