జిల్లా కేంద్రంలో పెరుగుతున్న నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్యాంకులు, జ్యువెలర్స్, లాడ్జిల యజమానులతో సమావేశం నిర్వహించి, భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా, అన్ని బ్యాంకులు, జ్యువెలర్స్, లాడ్జిల నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ కోరారు.
బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించడంతో పాటు, సీసీ కెమెరాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై కదలికలు, వ్యక్తుల రాకపోకలను రికార్డ్ చేసేలా కెమెరాల అమరిక ఉండాలని, కొత్తగా ఉద్యోగులను నియమించుకునే ముందు వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
లాడ్జిల నిర్వాహకులు గుర్తింపు కార్డులు లేని వ్యక్తులకు గదులు కేటాయించరాదని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ ప్రకాష్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలను ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంచిర్యాల, శ్రీరాంపూర్ సీఐలు ప్రమోదరావు, అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.











