సంగారెడ్డి, 2026-08-17
పేదింటి ఆడబిడ్డల సంక్షేమ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ పథకాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామలా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచారని, సుమారు మూడు లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. కోవిడ్ వంటి ఆర్థిక సంక్షోభ సమయంలోనూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో పెళ్లి భారం తగ్గిందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో భరోసా లభించిందని చింత ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి ఏమైంది షాదీ ముబారక్ ఏమైంది పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు ఆర్థిక సహాయం ఎప్పుడు అందిస్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
పథకాలను కొనసాగించే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలకు మేలు జరగకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని, పలుమార్లు అవకాశం లభించినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన కీలక కేసుల్లో ప్రైవేటు న్యాయవాదుల సేవలు పొందే ప్రభుత్వం, పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి విషయంలో ఎందుకు సమర్థవంతంగా స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి, ఇప్పుడు హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని చంటి క్రాంతి కిరణ్ అన్నారు.












