మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలో ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో వృక్ష రక్షబంధన్ కార్యక్రమం వైభవంగా జరిగింది. చెట్లను అమ్మ, నాన్నలుగా భావించి, వాటికి సహజ సిద్ధమైన రాఖీలు కట్టి, ఆలింగనం చేసుకుని, వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
చెట్లను అమ్మ, నాన్నలు, తోబుట్టువులు, ఆత్మీయ నేస్తాలుగా భావించాలని, మనిషికి చెట్టు రక్ష, చెట్టుకు మనిషి రక్షగా ఉండాలని ప్రకృతి మిత్ర తెలంగాణ పిలుపునిచ్చింది. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మనిషికి చెట్టు రక్ష, చెట్టుకు మనిషి రక్ష వృక్ష రక్షబంధన్ పేరిట బుధవారం మంచిర్యాల జన్మభూమి నగర్లోని ప్రాచీన రాముని చెరువు కట్టపై వైవిధ్యభరితమైన కార్యక్రమాన్ని సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రభుత్వ వాల్టా పర్యావరణ చట్టం సెనేట్ సభ్యులు గుండేటి యోగేశ్వర్, ప్రకృతి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సహజ సిద్ధ రాఖీలతో వృక్ష బంధం
ముందుగా కార్యక్రమంలో పాల్గొన్నవారు పరస్పరం సహజమైన పదార్థాలతో చేసిన రాఖీలను కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వివిధ ప్రకృతిమిత్ర పదార్థాలతో అట్ట, కాగితం, ధాన్యం గింజలు, ఆకులు, పూల రెక్కలు, డ్రై ఫ్రూట్స్ వ్యర్థాలు, దూదితో చేసిన ఆకర్షణీయమైన పెద్ద సైజు రాఖీలను ఎంతో ప్రేమగా చెట్లకు కట్టి ఆలింగనం చేసుకున్నారు. చెట్లకు కృతజ్ఞతలు తెలిపారు. చెట్ల కింద సరదాగా గడిపారు.
చెట్ల చుట్టూ మానవహారం
అనంతరం చెట్ల చుట్టూ మానవహారంగా ఏర్పడి చెట్లే ప్రగతికి మెట్లు... చెట్లు నరికితే ఇక్కట్లు.. వేయకు చెట్టుకు వేటు... చేయకు భూమాతకు చేటు.. వనాలు ప్రకృతి ఇచ్చిన వరాలు... కాపాడుతాయవి అవి మనల్ని తరతరాలు.. పెరిగిన పచ్చదనం.. ఆరోగ్యానికి మూలధనం.. చెట్టును ఆత్మీయ నేస్తాలుగా చేరదీయాలి.. అమ్మ నాన్నలుగా పూజించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సేవ్ ట్రీస్.. సేవ్ నేచర్ అంటూ నినదిస్తూ చెట్ల సంరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు.
చెట్ల సంరక్షణ ఆవశ్యకత
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రత్నాకర్ రావు, రెవెన్యూ అధికారి గడియారం శ్రీహరి, రాచకొండ చందన, రాధేశ్యాంలు మాట్లాడుతూ.. మానవునితో పాటు సకల జీవనానికి ఆధారమైన చెట్లను ఆత్మీయ నేస్తాలుగా గౌరవించాలని సూచించారు. వివిధ కారణాలతో తొందరపాటు చర్యలతో చెట్లను నరకవద్దని, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారి నిర్మాణంలో వివిధ శాఖల అధికారులతో ఆదర్శవంతమైన ప్రణాళికలు రూపొందించి చెట్లను కాపాడాలని కోరారు. తప్పని పరిస్థితిలో ఒక చెట్టు నరికితే బదులుగా పది చెట్లు నాటి రక్షించాలన్నారు.
వృక్ష సంరక్షణపై ప్రాధాన్యత
వనమహోత్సవాల లో చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, ఏపుగా పెరిగిన ఏండ్ల నాటి చెట్లను, మహా వృక్షాలను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యమని అన్నారు. చెట్టు మనిషికి రక్ష, మనిషి చెట్టుకు రక్షగా మారాలని పిలుపునిచ్చారు. ప్రజలు, యువత, మహిళలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్కు బదులు సహజసిద్ధమైన రాఖీలను పరస్పరం కట్టుకొని, అనంతరం అందుబాటులో ఉన్న చెట్లకు రాఖీలు కట్టి రక్షించాలని తెలిపారు.











