మంచిర్యాల్ (అక్షరవేకువ) జూలై 06
మంచిర్యాల్ జిల్లాలో ఈనెల 13వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 1,58,480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
మంచిర్యాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రచారం చేయడానికి, ప్రజలలో, తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి వీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఒకటి సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేస్తామని తెలిపారు. మన జిల్లాలోని 930 అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకున్న పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నమోదు చేసుకున్న పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు చేసుకున్న పిల్లలు, గ్రామాలలో 19 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ ఆశా కార్యకర్తల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 1,58,480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని తల్లులకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, కాలేజ్ విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడే పిల్లలు ఎప్పుడూ అలసటగా ఉంటారని, శారీరక పెరుగుదల, మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని, అలాంటి వారికి నులిపురుగులు ఉన్నాయని గుర్తించవచ్చని తెలిపారు. కావున, నులిపురుగుల నిర్మూలనకు ఈ మాత్రలను తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం టాబ్లెట్, రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక టాబ్లెట్ పొడిచేసి తాగించాలని, 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఒక ఆల్బెండజోల్ టాబ్లెట్‌ను నమిలి తినిపించాలని సూచించారు. ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు, పెద్దలకు కూడా సురక్షితమైనవని, అయితే ఈ మాత్రలను పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో మాత్రమే అందించాలని, ఇంటికి ఇవ్వరాదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా విద్యాశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవి, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, ఆర్ఎస్ పద్మ, డిపిఓ శ్రీమతి ప్రశాంతి, సుమన్, సురేందర్, జిల్లా ఆర్బీఎస్కే వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










