మంచిర్యాల ఆర్టీసీ డిపోలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల పెత్తనాన్ని సహించబోమని, వారి తీరుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టినట్లు మంచిర్యాల ఆర్టీసీ జేఏసీ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణ్ తెలిపారు.
అధికారులు ఇష్టరీతిగా ప్రవర్తిస్తే సహించేది లేదని, డ్రైవర్లపై జరుగుతున్న అధికార దుర్వినియోగానికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర వర్కర్లు పాల్గొంటారని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
సోమవారం మధ్యాహ్నం నుంచి బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
జేఏసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ, తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, డ్రైవర్ల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ తీరును మార్చుకోకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు.











