రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యక్తిగత సహాయకుల (పిఏ) తీరుపై ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలుపునకు తమదే కీలక పాత్ర అన్నట్లుగా కొందరు పిఏలు వ్యవహరిస్తున్నారని, ఇది నాయకులకు చెడ్డపేరు తెస్తోందని విమర్శలు వస్తున్నాయి.
కొంతమంది పిఏలు తమకు అండగా నిలిచిన నాయకుల కంటే తామే గొప్ప అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రమేయం వల్ల క్లారిటీ లోపించి, ప్రజలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. నాయకుల బిజీ షెడ్యూల్ ను సాకుగా చూపిస్తూ, ప్రజలను, కార్యకర్తలను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
పనితీరు కంటే ఆర్భాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కొందరు పిఏలు తమ సొంత డబ్బుతోనే అన్నీ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందుబాటులో లేనప్పుడు, తమను తాము గొప్పగా చెప్పుకోవడానికి, భజనపరులను పక్కన పెట్టుకుని, తమ సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ తీరు వల్ల అసలు నాయకుల ప్రతిష్ట దెబ్బతింటుందని, పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని సమాచారం. పిఏల అతి ప్రవర్తన, అహంకారం నాయకులకు ఇబ్బందికరంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నా, పిఏలు మాత్రం 'సార్ మీటింగ్లో ఉన్నారు', 'టైం లేదు', 'ఇప్పుడు కలవడం కుదరదు' వంటి మాటలు చెప్పి ప్రజలను, కార్యకర్తలను దూరం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.









