మందమర్రి ఏరియా TBGKS యూనియన్, BRS పార్టీ నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై సింగరేణి కార్మికుల సమస్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మందమర్రి ఏరియా TBGKS యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, BRS పార్టీ అధ్యక్షుడు J.రవీందర్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఓ రాజశేఖర్ తదితరులు మంగళవారం మందమర్రిలో విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రిపై ధ్వజమెత్తారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత మంత్రి, కాంగ్రెస్ నాయకులు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని TBGKS, BRS నాయకులు ఆరోపించారు. వాస్తవానికి, కంపెనీని ఆదుకోవడానికి అప్పటి ప్రభుత్వం 663 కోట్లు ఇప్పించి, కార్మికుల సంఖ్యను తగ్గించిందని వారు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కారుణ్య నియామకాల ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, కార్మికులను కాపాడారని వారు తెలిపారు. KK 5 గనికి మంత్రి వచ్చినప్పుడు కార్మికులు వారసత్వ ఉద్యోగాల ప్రకటన ఆశించారని, కానీ నిరాశే ఎదురైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి భారీగా బకాయిలు పడిందని, వాటిని ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, సొంతిల్లు పథకం, కొత్త గనులు, మారుపేర్ల పరిష్కారం, ఆదాయ పన్ను రద్దు వంటి అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజలు, కార్మికులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.








