సంగారెడ్డి, 2026-11-26
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా సంగారెడ్డి జిల్లాకు నూతనంగా నియమితులైన నలుగురు మెడికల్ ఆఫీసర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.లలితా దేవి గురువారం నియామక పత్రాలను అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన వైద్యాధికారులకు నియామక పత్రాలు అందించి, వారిని అభినందించారు. నూతన నియామకాల్లో భాగంగా, ఆర్ బీ ఎస్ కే డీఈఐసీ విభాగానికి ఒకరు, పాలియేటివ్ కేర్ విభాగానికి ఒకరు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అత్యవసర విభాగానికి ఇద్దరు వైద్యాధికారులను నియమించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. నలుగురు వైద్యాధికారుల నియామకంతో జిల్లాలో వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. డీఈఐసీ విభాగంలో వైద్యాధికారి అందుబాటులోకి రావడంతో, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. జనరల్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఇద్దరు వైద్యులు నియమితులు కావడంతో, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
నూతన వైద్యాధికారులు విధుల పట్ల బాధ్యత, అంకితభావంతో పని చేయాలని, రోగులతో మర్యాదగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. నియామక పత్రాలు అందుకున్న వైద్యాధికారులు ప్రభుత్వానికి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






