అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 16
తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పనిచేసిన ముదిరాజుల వివరాలను సేకరించి, వారికి సమాజంలో తగిన గౌరవం కల్పించేందుకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ చర్యలు చేపట్టింది. ఈ సమాచార సేకరణ బాధ్యతలను ఒక కమిటీకి అప్పగించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మంది ముదిరాజులు స్థానికంగా ఉన్న సంఘాల ప్రోత్సాహంతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వివిధ ప్రాంతాలలో ర్యాలీలు, వంటావార్పు, సహాపక్తి భోజనాలు, బతుకమ్మలు, బోనాలు వంటి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
1969 ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి జైలుకు వెళ్లిన వారు, త్యాగాలు చేసిన వారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించేందుకు ఇటీవల డా. కేశవరావు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
1969 ఉద్యమాల్లో పాల్గొన్న, 2001 నుంచి 2013 వరకు వివిధ దశల్లో తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన, గాయపడిన, అంగవైకల్యం చెందిన, అరెస్ట్ అయి జైళ్లలో మగ్గిన, అనేక సభలు, సమావేశాల్లో పాల్గొన్న వారి సమగ్ర సమాచారాన్ని సేకరించి డా. కేశవరావు కమిటీకి అందజేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్ణయించింది.
ఈ సమాచార సేకరణ బాధ్యతలను డా. బండా ప్రకాశ్ (తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు), రిటైర్డ్ ప్రొఫెసర్ నీల రాములు, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ కుమార్, డా. యాకయ్య (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)లకు అప్పగించారు. వీరు వివిధ జిల్లాలలో పర్యటించి బాధ్యులను సంప్రదించి త్వరలో సమాచార సేకరణ చేపడతారు. కాబట్టి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు వీరికి సహకరించి సమాచారాన్ని అందించాలని కోరుతున్నాము.











