బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత విమర్శలు చేసిన బొలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యంల తీరును బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్న నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
బీజేపీ పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుండి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం నిన్న ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గడ్డం స్వామి రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షులు కర్రె చక్రవర్తి ఆధ్వర్యంలో మరో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భూ సెటిల్మెంట్ చేసే వారితో కుమ్మక్కై, జిల్లాలో బీజేపీ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్న నాయకులను, రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతి సమస్యపై పోరాడుతున్న రఘునాథ్ గారిపై, ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవిలో లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుండి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు.
జాతీయ రహదారి 63 విషయంలో, రఘునాథ్ గారు ఎవరికీ నష్టం కలగకుండా లక్షట్టిపేట పట్టణం గుండా కాకుండా, పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించాలని మాత్రమే కోరారని, అలైన్మెంట్ మార్చాలని ఎక్కడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని వారు తెలిపారు. జాతీయ రహదారి విషయంలో రఘునాథ్ గారు వ్యాపారుల నుండి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలను అవమానించేలా, పాలేరులకు పదవులు ఇస్తున్నారనడం బాధాకరమని వారు అన్నారు. గతంలో తిరుపతికి మండల అధ్యక్షుడిగా, సత్యంకు మండల ప్రధాన కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు అప్పగించిన రఘునాథ్ గారిని, ఇప్పుడు పాలేరులని అనడం సరికాదని వారు ప్రశ్నించారు. బొలిశెట్టి తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇప్పించిన నాయకుడు రఘునాథ్ గారేనని వారు గుర్తు చేశారు.
జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రఘునాథ్, వెంకటేశ్వర్ గౌడ్ లపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామి రెడ్డి, కుర్రె చక్రవర్తి, మధువరపు రమణ రావు, బియ్యాల సతీష్ రావు, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్, మెరెడికొండ శ్రీనివాస్, రాజనర్సు, కొంకటి మహేందర్, ఇలవేణి సతీష్, సాగర్, చిందం తిరుపతి, బూర్ల అజయ్, కంపల్లి రవి మరియు తదితరులు పాల్గొన్నారు.











