చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైకోలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మిలిటెంట్ దాడులు చేస్తేనే ప్రజలలో గుర్తింపు వస్తుందని బిఆర్ఎస్, టీబీజికెఎస్ నాయకులను రెచ్చగొట్టే విధంగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బాల్క సుమన్ కు మతిభ్రమించిందని, ఆయన కేటీఆర్, కేసీఆర్ సూచనలతోనే కార్యకర్తలను దాడులకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
బిఆర్ఎస్ హయంలో నిధులు లేని అభివృద్ధి పనులకు ఆర్భాటాలతో శిలా ఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టారని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై కక్ష సాధింపు చర్యలకు బాల్క సుమన్ పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












