తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కందుల సంధ్యారాణిని నియమించారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన ఆమెకు ఈ పదవి లభించడం కష్టానికి దక్కిన గౌరవంగా నాయకులు అభివర్ణిస్తున్నారు.
కందుల సంధ్యారాణి ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆమె 2006 నుంచి 2008 వరకు MPTCగా, 2008 నుంచి 2014 వరకు రామగుండం ఎంపీపీగా సేవలందించారు. అనంతరం 2014 నుంచి 2019 వరకు, అలాగే 2019 నుంచి 2023 వరకు వరుసగా రెండు సార్లు ZPTCగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.
మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన సంధ్యారాణి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ బీసీ వర్గాల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆమె నియామకం బీసీ మహిళలకు మరింత ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
రామగుండం ప్రాంతంలో మహిళల సమస్యల కోసం నిరంతరం పోరాడే నాయకురాలిగా కందుల సంధ్యారాణి గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి సేవలు అందించిన ఆమెను స్థానికులు ప్రశంసించారు. పార్టీ పట్ల నిబద్ధత, కష్టపడే తత్వం, ప్రజల పట్ల మమకారం, సేవా దృక్పథమే ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూ బీసీ వర్గాల అభ్యున్నతికి పనిచేస్తానని ఆమె తెలిపారు.







