పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు తమ ఐక్యతను, సంక్షేమాన్ని, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు సమష్టిగా నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీయూడబ్ల్యూజే-హెచ్ 143 పటాన్చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ధూళిపాళ్ల రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అంతారం మహేష్ గౌడ్ ఎన్నికయ్యారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోకర్ శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చింతల రామకృష్ణ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులు తమపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జర్నలిస్టులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవులను అలంకారప్రాయంగా కాకుండా, జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, అవసరమైన సందర్భాల్లో రాష్ట్ర, జిల్లా కమిటీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ అంశాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, జర్నలిస్టుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో జిన్నారం, గుమ్మడిదల, అమీన్పూర్, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గాలకు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.












