రంగురంగుల పూల సోయగాలు, బతుకమ్మ పాటలు, మహిళల ఆటపాటల కోలాహలం నడుమ సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీపీసీసీ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూలతో పేర్చిన బతుకమ్మలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుద్దీపాల అలంకరణలతో చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది. ఎనిమిది టన్నుల పూలతో రూపొందించిన 32 అడుగుల మహా బతుకమ్మ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 16 టన్నుల ఉక్కుతో నిర్మాణాన్ని సిద్ధం చేసి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు చెరువు కట్ట పొడవునా ఆరు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఆయా వేదికల వద్ద కళాకారుల ఆటపాటలు, జానపద గీతాలు అలరించాయి. ప్రత్యేక ట్రస్ లైటింగ్‌తో వేదికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారీ తెరలు, ఫ్లడ్‌లైట్ టవర్లు, విద్యుద్దీపాల వెలుగులతో చెరువు కట్ట పరిసరాలు కాంతులీనాయి. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గత పది రోజులుగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సాయంత్రం ఐదు గంటల నుంచే చెరువు కట్ట వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి నిర్మల జగ్గారెడ్డి, జయారెడ్డి బతుకమ్మ ఆడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, కూన సంతోష్, కిరణ్‌గౌడ్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.










