సమాజంలోని అన్ని వర్గాల సమన్వయంతో బాల్య వివాహాలను సమర్థవంతంగా నిర్మూలించవచ్చని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం–2006 మరియు “బాల్య వివాహ ముక్త్ భారత్”పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో పాస్టర్లు, పురోహితులు, ఖాజీలు, బాల్య వివాహ నిరోధక అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలను తగ్గించడానికి బాలిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా, బాల్య వివాహాలు జరగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బాల్య వివాహాల నివారణలో మత గురువుల పాత్ర చాలా కీలకమని, వారి సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం, బాల్య వివాహాలు శిక్షార్హమైన నేరమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ వివరించారు. ఈ వివాహాలలో పాల్గొన్న లేదా సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరి సహకారం కోరారు.
తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ కూడా బాల్య వివాహాల నివారణలో తమవంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విశ్వజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహ నిర్మూలనపై రూపొందించిన గోడపత్రికలను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం, బాల్య వివాహ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.










