గతంలో నిలిచిపోయిన మంచిర్యాల - చెన్నూరు 'పల్లె వెలుగు' బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ఇలియాజుద్దీన్ సమర్పించిన వినతి మేరకు ఈ చర్యలు చేపట్టారు.
మంచిర్యాల నుండి చెన్నూరు వరకు నడిచే ఈ బస్సు సర్వీసు నిలిచిపోవడం వల్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు, రోగులు రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారని యూత్ కాంగ్రెస్ చెన్నూరు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇలియాజుద్దీన్ మంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఆయన కోరారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సును నడపడం ద్వారా వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని ఇలియాజుద్దీన్ తెలిపారు. రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్న ఈ ప్రాంతంలో బస్సు సర్వీసు పునఃప్రారంభం అత్యవసరమని ఆయన వినతిలో పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ వినతికి సానుకూలంగా స్పందించి, వెంటనే డిపో మేనేజర్‌తో మాట్లాడి, బస్సును తిరిగి ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.








