మందమర్రి ఏరియాలోని K.K-5 గనిలో పనిచేస్తూ శ్రమ శక్తి అవార్డులు అందుకున్న ఏడుకోల పవన్ కుమార్, పుల్లూరి లక్ష్మణ్ లను రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సింగరేణి అభివృద్ధిలో కార్మికుల పాత్రను కొనియాడుతూ, భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, అవార్డు గ్రహీతలను శాలువాతో సత్కరించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గని పరిసరాల్లో కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు.
రాబోయే కోల్ బ్లాక్ టెండర్లలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొంటుందని మంత్రి స్పష్టం చేశారు. కొత్త గనులు ప్రారంభించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ (ఫేజ్-2) ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. అటవీ శాఖ అనుమతులు రాగానే ఈ గని పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
మందమర్రి ఏరియా జీ.ఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, మంత్రి గారి మార్గదర్శకత్వంలో మందమర్రి ఏరియాను ఉత్పత్తి, రక్షణలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు ఇతర కార్మికులకు స్ఫూర్తిదాయకమని, గని భద్రతతో పాటు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో కార్మికులు భాగస్వాములు కావాలని కోరారు. మేనేజ్మెంట్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి గారు అధికారులతో కలిసి గనిలోకి దిగి పని ప్రదేశాలను పరిశీలించారు.











