పెద్దపల్లి జిల్లా, మంథని పట్టణంలో ఆదివారం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ (డీజేఎఫ్డబ్ల్యూ) ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. బూడిద రాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆదివారం మంథని పట్టణంలో జరిగిన డీజేఎఫ్డబ్ల్యూ కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తంగలపల్లి అరుణ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ దార మధు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో సంస్థ బలోపేతం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంఘ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బూడిద రాజు జిల్లా అధ్యక్షుడిగా, బండం చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జోడు సురేష్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారు మాట్లాడుతూ, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్‌ను జిల్లాలో మరింత బలోపేతం చేస్తామని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ లక్ష్యాల సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, సంఘ సభ్యులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.












