లక్షెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పంటను కాపాడుకునే ప్రయత్నంలో తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ అనే తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షం గంపలపల్లి గ్రామంలో తీవ్ర నష్టం కలిగించింది. ఈ క్రమంలో, తమ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించిన తనుగుల నాగరాజు, ఆయన కుమారుడు అభిరామ్ నీట మునిగి మృతి చెందారు. వీరి మృతదేహాలను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ లు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే, జిల్లా అధికారులు బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే 20 లక్షల రూపాయల పరిహారం అందించాలని కోరారు.












