జైపూర్ మండలంలో అనధికార బెల్టు షాపులు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయని, మద్యం అమ్మకాలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం అందుబాటులో ఉండటంతో పరిస్థితి అదుపుతప్పుతోందని, అధికారిక వైన్ షాపులకు పరిమితం కావాల్సిన అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నాయని బాధితులు తెలిపారు. మండలంలో సుమారు 40 వరకు బెల్టు షాపులు నడుస్తున్నాయని, రహదారుల పక్కన వీటిని ఏర్పాటు చేసి నిరంతరం మద్యం విక్రయిస్తున్నారని సమాచారం.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా మద్యం సీసాలపై రూ.30 నుండి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, ఇది సాధారణ ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో రోజుకు లక్ష రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా.
వైన్స్ సిండికేట్ల సహకారంతోనే ఈ వ్యాపారం కొనసాగుతోందని, అధికారిక షాపుల నుంచి మద్యం తరలించి బెల్టు షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. 21 ఏళ్లు నిండిన వారికి మాత్రమే మద్యం అమ్మాలనే నిబంధనలు పాటించకపోవడంతో యువత మద్యానికి బానిసలవుతున్నారని, ఇది కుటుంబాల్లో సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ అధికారులు టార్గెట్ల ఒత్తిడి, మామూళ్ల ప్రభావంతో బెల్టు షాపులపై చర్యలు తీసుకోవడం లేదని, దాడులు నామమాత్రంగానే ఉంటున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, అనధికార మద్యం విక్రయాలను పూర్తిగా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.










