తన భార్య, ఆమె బంధువుల వేధింపుల కారణంగా ఆస్తిని కోల్పోయి, రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని మంచిర్యాలకు చెందిన ఓ సీనియర్ సిటిజన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంచిర్యాల DCPకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
మంచిర్యాలకు చెందిన తురాబ్ (65) అనే వృద్ధుడు తన భార్య, ఆమె బంధువులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 1982లో షమీమ్ సుల్తానాను వివాహం చేసుకున్న ఆయన, తన స్వగ్రామంలో ఆస్తులు అమ్ముకొని, ACCలో 306 గజాల భూమి కొనుగోలు చేసి, దానిపై ఇల్లు కట్టించారు. ఈ క్రమంలో, తమ వద్దకు వచ్చిన ఒక అనాథ బాలికను పెంచి, ఇంటర్మీడియట్ వరకు చదివించారు. అయితే, తన భార్య షమీమ్, కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్దుల్ రహీమ్ అనే బంధువుతో సన్నిహితంగా ఉంటూ, తనను వేధింపులకు గురిచేసిందని తురాబ్ ఆరోపించారు.
తన భార్య, అబ్దుల్ రహీమ్ కలిసి కుమ్మక్కై, తనకు తెలియకుండా తాను పెంచుకుంటున్న బాలికకు మైనర్ వివాహం జరిపించారని, అనంతరం తనను ఇంట్లోంచి గెంటేసి, ఆస్తిని కాజేశారని తురాబ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు, మినాజ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని, తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నాడని, అతని వల్లే తాను నిరాశ్రయుడయ్యానని తెలిపారు.
తనకు న్యాయం చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తురాబ్ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. వృద్ధుడి ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధితుడికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.








