లక్షెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూరు గ్రామాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు మరణించిన ఘటనపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్లే రైతులు నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చిందని రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కమీషన్ల కోసం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై, ధాన్యం తరలింపులో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనలో మరణించిన నలుగురు రైతుల మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా, రఘునాథ్ వెరబెల్లి తన వంతుగా మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల తక్షణ సహాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీజేపీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
ప్రమాదానికి గురైన రైతుల కుటుంబాలను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలిసి, వారిని పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.











