సంగారెడ్డి, 2026-08-25
సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను వంద శాతం సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది.
జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను వంద శాతం సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2026 మాసాంతానికి పంట రుణాలు, వ్యవసాయ మరియు ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని అదనపు కలెక్టర్ సమీక్షించారు.
పంట రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందిస్తున్నప్పటికీ, మరికొన్ని బ్యాంకులు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, తదుపరి సమావేశం నాటికి వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధికి చేయూత అందించాలని తెలిపారు. రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, పరిశ్రమల శాఖ జీఎం తుల్జా నాయక్, ఆర్.బి.ఐ రీజినల్ మేనేజర్, మెప్మా అధికారులు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.












