రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్‌లను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
నర్సాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మన్నె దిగంబరరావు అధ్యక్షతన మన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్‌లు ఏ పార్టీలో ఉన్నా ముందు వరుసలో ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్‌ల సంఖ్య బలంగా ఉందని తెలిపారు. రాజకీయంగా బలపడాలంటే పార్టీలకు అతీతంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు మన కుల అభ్యర్థులు ఉంటే వారికే ఓటేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ముదిరాజ్‌లను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మారుస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను దాటేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు నిజ్జన రమేష్, తెలంగాణ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తయ్య, ఓయూ జేఏసీ నాయకులు అల్లుడు జగన్, రాష్ట్ర నాయకులు శైలేంద్ర, ఈటెల భద్రయ్య, కళాకారులు బుల్లెట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.












